ఎన్.టి.ఆర్ ని దర్శించుకున్నాకే థియేటర్ లోకి ఎంట్రీ బాలయ్య నిర్ణయం

Spread the love

దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలో తండ్రి పాత్రను స్వయంగా తానే పోషిస్తూ దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కి అప్పగించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్‌పై ఈ చిత్ర నిర్మాణం చేపట్టారు బాలకృష్ణ. ఎన్టీఆర్ తన సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో చిత్రాన్ని ‘‘కథానాయకుడు, మహానాయకుడు’’ అనే రెండు భాగాలుగా రూపొందించారు చిత్ర యూనిట్.

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఎన్నో అపురూప దృశ్యాలని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారని పేర్కొన్నారు. అప్పటి నటీనటులను మరోసారి తెరపై చూసే అపూర్వ అవకాశం ఈ సినిమా ద్వారా లభించనుండటంతో ప్రేక్షకలోకం ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది . ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర యూనిట్ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా జనవరి 9 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్ లను చిత్రబృందం ఎంపిక చేసింది. అలా ఎంపిక చేసిన 100 థియేటర్లలో 100 ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు ఈ చిత్ర నిర్వాహకులు. అంటే ముందుగా థియేటర్‌కి వెళ్ళాక స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ దర్శనం చేసుకొని సినిమా చూస్తారన్నమాట, ఈ వినూత్న ప్రయోగానికి ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పై అటు నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..


Spread the love